పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను **’పాకిస్థానీ కశ్మీర్’**గా పేర్కొంటూ కథనం ప్రచురించిన ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ది న్యూయార్క్ టైమ్స్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదప్రయోగం పూర్తిగా అవాస్తవమని, అంతర్జాతీయ వాస్తవాలకు విరుద్ధమని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “పాకిస్థానీ కశ్మీర్ అనే భౌగోళిక ప్రాంతం లేదు. అది పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) మాత్రమే” అని పేర్కొంది.
జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని, వాటిపై భారత సార్వభౌమాధికారం ఎప్పటికీ కొనసాగుతుందని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అలాగే, పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజల హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక చర్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన స్థానిక ఎన్నికలు, పౌర హక్కుల ఉద్యమాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంలో “Pakistani Kashmir” అనే పదాన్ని ఉపయోగించింది. దీనిపై భారత్ దౌత్యపరంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ వేదికలపై దేశ భౌగోళిక సమగ్రత, సార్వభౌమాధికారంపై తన స్పష్టమైన వైఖరిని మరోసారి వెల్లడించింది.
📌 మరిన్ని తాజా జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం గ్రామదండోరాను అనుసరించండి.
