*చక్రం ఆగుతోంది.. బతుకు చక్రం తిరగట్లే.!*• ప్లాస్టిక్ దెబ్బకు విలవిలలాడుతున్న కుమ్మరి కులవృత్తి• 4.3 లక్షల జనాభాకు ఒక్క రాజకీయ ప్రాతినిధ్యమూ లేదు.. • పింఛను, చేయూత కోసం ఎదురుచూపు*వట్ పల్లి* (*గ్రామ దండోరా*), ఆగస్టు 22:-మనిషి జననం నుండి మరణం వరకు ప్రతి ఘట్టంలో పెనవేసుకున్న ఒకే ఒక కులవృత్తి కుమ్మరి వృత్తి.కానీ ఆ వృత్తి ఇప్పుడు చివరి శ్వాస తీసుకుంటోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆధునిక మార్కెట్ పోటీతో తెలంగాణలో కుమ్మరి కుటుంబాలు గ్రామాలను వదిలి పట్నం బాట పడుతున్నాయి. తరతరాల కళ నేడు కనుమరుగయ్యే దశకు చేరుకుంది. కమ్మరి వృత్తి పై *గ్రామ దండోరా* ప్రత్యేక కథనం.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వృత్తిపై ఆధారపడిన వారిని కుమ్మర, శాలివాహన, కుంభకార, ప్రజాపతి అంటారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన కళల్లో ఇదొకటి. చెరువుల్లోని బంకమట్టిని తెచ్చి, దానిని చక్రంపై తిప్పుతూ కుండలు, ప్రమిదలు, ముంతలుగా మలచడం వెనుక తరాల నైపుణ్యం దాగి ఉంది. ఆరబెట్టిన వాటిని ‘వామి’ బట్టీలో కాల్చి తయారు చేస్తారు. వేసవిలో చల్లని నీటినిచ్చే కుండ దగ్గర్నుంచి దీపావళి ప్రమిదల వరకు వీరి చేతి ముద్ర లేని పండుగే లేదు.*ప్లాస్టిక్ విరుచుకుపడుతున్న దెబ్బ..*గత దశాబ్ద కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చిన ప్లాస్టిక్, స్టీల్, అల్యూమినియం పాత్రలు, ఫ్రిజ్‌ల వాడకం కుమ్మరి పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. మట్టి పాత్రలకు డిమాండ్ లేక, రోజుకు రూ.200 కూడా గిట్టుబాటు కావడం లేదని కళాకారులు వాపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ మండలం ఆల్మాయిపేట సహా జిల్లాలోని అనేక గ్రామాల్లో కుమ్మరి కుటుంబాలు కులవృత్తిని వదిలి భవన నిర్మాణ కూలీలుగా, హైదరాబాద్‌లో ఇతర పనులకు వలస వెళ్తున్నారు.*4.3 లక్షల మందికి రాజకీయంగా మొండిచేయి..*ఈ దుస్థితికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.! తెలంగాణ రాష్ట్రంలో శాలివాహన కుల జనాభా 4,31,363. ఇది మొత్తం జనాభాలో 1.2%. బీసీ-బీ కేటగిరీలో ఉన్న ఈ సామాజిక వర్గానికి నేటి వరకు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం కూడా దక్కలేదు.!దీంతో వీరి సమస్యలు అసెంబ్లీలో వినిపించే నాథుడే లేకుండా పోయాడు అని ఆవేదన వెలగక్కుతున్నారు.*ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..*• కె. సాయికుమార్ (అల్మాయి పేట)ఈ విషయంపై ఆల్మాయిపేటకు చెందిన కుమ్మరి కళాకారుడు కె.సాయికుమార్ మాట్లాడుతూ.. “తాత ముత్తాతల నుంచి ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నాం. ప్లాస్టిక్‌తో పోటీ పడలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. 50 ఏళ్లు దాటిన కళాకారులకు ప్రభుత్వం పింఛను ఇవ్వాలి. మాకు ఆధునిక విద్యుత్ చక్రాలు, సబ్సిడీపై మట్టి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, మా నైపుణ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.ఆరోగ్యానికి మేలైన మట్టిపాత్రల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు, వాటిని తయారు చేసే కళాకారుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోకపోతే, భవిష్యత్ తరాలకు కుమ్మరి చక్రం కేవలం మ్యూజియంలో మాత్రమే కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
చక్రం ఆగుతోంది.. బతుకు చక్రం తిరగట్లే.!*• ప్లాస్టిక్ దెబ్బకు విలవిలలాడుతున్న కుమ్మరి కులవృత్తి• 4.3 లక్షల జనాభాకు ఒక్క రాజకీయ ప్రాతినిధ్యమూ లేదు.. • పింఛను, చేయూత కోసం ఎదురుచూపు*వట్ పల్లి*
