భద్రాచలంలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు.. పేర్లు వెల్లడించని ఫుడ్ సేఫ్టీ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో మూడు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 11 హోటళ్ల లైసెన్సులు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మరో నాలుగు హోటళ్లకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
అయితే లైసెన్సులు రద్దు చేసిన 11 హోటళ్ల పేర్లను అధికారులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏయే కారణాలతో లైసెన్సులు రద్దు చేశారు? తనిఖీల సమయంలో గుర్తించిన లోపాలేమిటి? నిబంధనలను ఉల్లంఘించిన అంశాలపై ఎందుకు పూర్తి వివరాలు ప్రకటించడం లేదు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించకుండా కేవలం ప్రకటనతోనే అధికారులు సరిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై వివరణ కోరేందుకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, లైసెన్సులు రద్దు చేసినట్లు చెబుతున్న కొన్ని హోటళ్లు ఇప్పటికీ యథావిధిగా కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. నిజంగా లైసెన్సులు రద్దు చేస్తే ఆయా హోటళ్లు ఎలా నిర్వహణ కొనసాగిస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో లైసెన్సులు రద్దు చేసిన హోటళ్ల పేర్లు, తనిఖీల నివేదికలు, లైసెన్సుల రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను బహిర్గతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని జాతీయ వినియోగదారులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి వెల్లడించింది.
11 హోటళ్ల లైసెన్సులు రద్దు చేసినట్లు ప్రకటించిన అధికారులు వాటి పేర్లు వెల్లడించకపోవడానికి కారణమేమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భద్రాచలంలో జరిగిన ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడైతేనే అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
